దేవుడు ఉన్నాడా? లేడా?

ఇది ప్రతి ఒక్కరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్నే. కష్టాలు వచ్చినప్పుడు వాటిని అనుభవించలేక దేవుడు లేడని కొందరు కఠిన నిర్ణయానికి వస్తుండగా దేవుడిని ప్రత్యక్షంగా చూడలేక ‘దేవుడు లేఢు’ అని బల్లగుద్ది వాదించేవారూ ఉన్నారు. దేవుడు ఉన్నాడా? లేడా? అని తెలుసుకోవడానికి దేవుడిని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం ఉందా? మనకున్న కొద్దిపాటి జ్ఞానముతో ఆలోచించి నిర్ధారించుకోలేమా?

‘‘ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే’’. హెబ్రీ 3:3

దేవుడు ఉన్నాడా? లేడా? అనే సందిగ్ధములో ఉన్నవారికి, దేవుడే లేడని వాదించేవారికి ఈ వాక్యము ఓ కనువిప్పు. గుడిసె మొదలుకొని భారీ భవనం వరకు ‘‘వీటిని ఎవరూ నిర్మించలేదు, వాటంతట అవే నిర్మితమయ్యాయి’’ అని చెబితే ఎంతమంది విశ్వసించగలరు?. అవన్నీ ఓ క్రమపద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని ఎవరో ఒకరు నిర్మించి ఉంటారనేది అందరి అభిప్రాయము. మానవుని శరీరము మొదలుకొని ఈ విశ్వము వరకు ఓ క్రమపద్ధతిలోనే నిర్మితమయ్యాయి. అది ఎలాగో చూద్ధాం.

తల, కళ్లు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్లు ఇలా బాహ్య అవయవములతో ఒక క్రమపద్ధతిలో మానవులు, మానవ శరీరాకృతిలో కొంచెం తేడాతో వివిధ జీవులు ఉన్నాయి. అలాగే జీవకోటి అంతా ఎంతో సంక్లిష్ఠమైన నిర్మాణముతో ఏర్పడ్డాయి.
మనం చూసేందుకు ఉపయోగపడుతున్న కంటిలో సుమారు 12వేల దృశ్యతంతులు ఉన్నాయి.

రుచిని తెలిపే నాలుకపై సుమారు 3వేల నుంచి 10వేల లోపు రుచి మొగ్గలు ఉంటాయి.

గుండె రోజుకు లక్షకు పైబడినసార్లు కొట్టుకుంటోంది. రోజుకు 13వేలకు పైబడిన లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తోంది.

రోజులో సుమారు 11వేల లీటర్ల గాలిని పీల్చుకుని వదులుతున్నాము.
మూత్రపిండాల్లో సుమారు 10లక్షల నెఫ్రానులు ఉంటాయి.

బాగా ఎదిగిన మానవునిలో 7 ఆక్టిలియన్ (7 పక్కన 27 సున్నాలు) కణాలు ఉంటాయి.

మెదడులో 120 కోట్ల నాడీ కణాలు ఉంటాయి.

వెన్నెముకలో 1.35 కోట్ల నాడులు ఉంటాయి.

మానవశరీరంపై ఉన్న చర్మములో ఒక అంగుళ భాగంలో సుమారు 30 లక్షల కణాలు ఉంటాయి.

చుక్క రక్తపు బొట్టులో 2.50 కోట్ల కణాలు ఉంటాయి.

ఇంతటి సంక్లిష్ఠమైన శరీర నిర్మాణమును కలిగిన మానవుడిని ‘ఎవరూ చేయలేదు. దానంతట అదే తయారైంది’ అని విశ్వసించడం ఎంత వరకు సమంజసం.

అలాగే సౌరమండలంలోని గ్రహాలు ఒక నిర్దిష్ఠ కక్షలో తిరుగుతున్నాయి. ఆత్మభ్రమణం (తమచుట్టు తాము తిరుగుతూ) చేస్తూ సూర్యుని చుట్టు తిరుగుతున్నాయి. గ్రహాలు చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఆత్మభ్రమణం, పరిభ్రమణాన్ని ఒక నిర్ధిష్ట వేగంతో చేస్తున్నాయి. వీటి నమూనాతో తయారు చేసిన యంత్రమే ఓర్రెరి (Orrery). ఈ యంత్రములోని నమూనాలన్నీ గ్రహాలు తరహాలోనే నికచ్చితముగా తిరుగుతాయి. ఈ యంత్రాన్ని ఎవరూ చేయకుండా వాటంతట అవే ఏర్పడి అలా తిరుగుతున్నాయి అని చెబితే ఎంతమంది విశ్వసించగలరు?. ఈ బుల్లి యంత్రం కన్నా కోటానుకోట్ల రెట్ల భారీ సౌరమండలం మాత్రము తానంతట అదే ఏర్పడిందని ఎలా సమర్ధించుకోగలము?.

అందుకే ‘‘ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే’’. హెబ్రీ 3:3‘‘ అని లేఖనము చెబుతోంది.

‘‘అయ్యో, మీరెంత మూర్ఖులు?
కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా?
చేయబడిన వస్తువు దాని చేసినవాని గూర్చి-
ఇతడు నన్ను చేయలేదనవచ్చునా?’’
-యెషయా 29:16Back to Top